LOADING...
Monsoon: ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఐఎండీ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఐఎండీ కీలక ప్రకటన

Monsoon: ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఐఎండీ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను అవి తాకినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేసే అవకాశముందని తెలిపింది. ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడే అవకాశమున్నందున కొన్ని రోజుల పాటు వర్షాలు కురవగా, మరికొన్ని రోజులు పొడి వాతావరణం కొనసాగవచ్చని వివరించింది.

వివరాలు

పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

వర్షపాతం అంచనాల ప్రకారం పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్‌ కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

వివరాలు

104 మండలాల్లో వడగాలులు ప్రభావం

ఆదివారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 104 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శనివారం కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించింది.

Advertisement