Telangana: జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి రుతుపవనాలు.. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మే చివరి నాటికే రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్ ఐదో తేదీ తర్వాతే చేరుకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలుత ఈ నెల 25వ తేదీన దేశ దక్షిణ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకుతాయని అంచనా వేసినా, ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావంతో వాటి కదలిక మందగించింది. హిందూ మహాసముద్రం,బంగాళాఖాతంలో విస్తరించిన గాలులు ప్రస్తుతం శ్రీలంక సమీపంలోనే నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
వివరాలు
జూన్ ఐదు నుంచి పది తేదీల మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే జూన్ ఐదు నుంచి పది తేదీల మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షాల పరిమాణంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పొడి వాతావరణం కారణంగా భానుడు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా, మరో ఆరు జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
సోమవారం రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలోని 145 మండలాల్లో వడగాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 19 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. మంచిర్యాల జిల్లాలో 17, సూర్యాపేటలో 14, ఖమ్మంలో 13, పెద్దపల్లిలో 12 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తలా 10 మండలాలు, మహబూబాబాద్‌లో 9, ములుగు మరియు నల్గొండ జిల్లాల్లో తలా 7 మండలాలు ప్రభావితమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఆరు మండలాలు, నిజామాబాద్‌లో ఐదు, నిర్మల్‌లో నాలుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో మూడు మండలాల్లో వడగాలులు వీచాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వివరాలు
ఈ జిల్లాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
రాబోయే మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ,బుధ,గురువారాల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలకు తీవ్ర ఉష్ణోగ్రతల హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే తొమ్మిది జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాలకు నారింజ రంగు హెచ్చరికలు కొనసాగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.