Page Loader
Sambhal violence: సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర.. స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..
సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర

Sambhal violence: సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర.. స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2024
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మక రూపం దాల్చిందని సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు మసీదు సర్వేకు వెళ్లిన అధికారులు, పోలీసులపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 30 మంది పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు, ఇళ్లు నాశనమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ పాత్ర ఉందని ఎఫ్ఐఆర్ నమోదైంది. చారిత్రక హరిహర్ ఆలయాన్ని మొఘల్ పాలకుడు బాబర్ కూల్చి ఈ మసీదును నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

700-800 మందిని అనుమానితులుగా ఎఫ్ఐఆర్‌లో నమోదు

హిందూ పక్షం కోర్టును ఆశ్రయించగా, కోర్టు సర్వేకు ఆదేశించింది. అయితే ఆదివారం సర్వే కొనసాగుతున్న సమయంలో స్థానికుల భారీ గుంపు మూడు వైపుల నుంచి అధికారులపై రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎంపీ జియా ఉర్ రెహ్మాన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహ్మూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా పాత్ర పోషించారని పోలీసులు వెల్లడించారు. 700-800 మందిని అనుమానితులుగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, హింస ప్రారంభానికి కొన్ని గంటల ముందు జియా ఉర్ రెహ్మాన్ మసీదులో నమాజ్ సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని పేర్కొంది. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు,రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యలకు పూనుకున్నారని కేసు నమోదైంది.

వివరాలు 

సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు

ఘర్షణ సమయంలో సోహైల్ ఇక్బాల్ గుంపును రెచ్చగొట్టి, వారికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పాడని తేలింది. దాడి సమయంలో పోలీసు అధికారులు గుంపును శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు రాళ్లు రువ్వుతూ, పోలీసు వాహనాలు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు, అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నేరస్తులను గుర్తించేందుకు డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నామని, పరిస్థితి దృష్ట్యా కఠినమైన జాతీయ భద్రతా చట్టం అమలు చేయవచ్చని పోలీసులు తెలిపారు.