Mission Bhagiratha: ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్ భగీరథపై ప్రత్యేక డ్రైవ్
ఈ వార్తాకథనం ఏంటి
రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్ భగీరథపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అధికారులు రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా జలాశయాల్లోని నీటిమట్టాలను ప్రతిరోజూ పరిశీలించడంతో పాటు, తాగునీటి నాణ్యతపై రోజువారీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పైప్‌లైన్‌లలో లీకేజీలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి 24 గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
వివరాలు
వాట్సప్ ద్వారా నియోజకవర్గాల్లోని మంచినీటి సరఫరా వివరాలు
అలాగే ప్రతి ఎమ్మెల్యేకు వారి నియోజకవర్గాల్లోని మంచినీటి సరఫరా వివరాలను రోజూ వాట్సప్ ద్వారా తెలియజేయాలని నిర్ణయించారు. అన్ని నీటిశుద్ధి కేంద్రాల్లో ఉపయోగించే క్లోరిన్‌తో పాటు ఇతర అవసరమైన రసాయనాలను కనీసం మూడు నెలలకు సరిపడా నిల్వ ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే, స్థానిక వనరులు, చేతి పంపులు, సింగిల్ ఫేజ్ మోటార్లు, బావులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా వనరుల పనితీరును ముందుగానే తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
1916కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు
రిజర్వాయర్ల నుంచి జరిగే బల్క్ నీటి సరఫరాపై రోజువారీ పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి, సమస్యలు ఎదురవుతున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ప్రత్యేక సెల్ పనిచేస్తోందని, టోల్‌ఫ్రీ నంబరు 1916కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.