CS Vijayanand: ప్రయివేటు ఆలయాలపై స్పెషల్ ఫోకస్.. రద్దీ నియంత్రణకు సీఎస్ కీలక ఆదేశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో ఆ సంస్థ కార్యకలాపాలు, ప్రజాభిప్రాయం (People's Perception)పై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజుల్లో వరుసగా పండుగలు, ప్రత్యేక పర్వదినాలు ఉండటంతో అన్ని ఆలయాల్లో భక్తుల జనసందోహం అధికంగా ఉంటుందని సూచించారు.
Details
పర్యవేక్షణపై స్పష్టమైన ఆదేశాలు
జిల్లా అధికారులంతా తమ పరిధిలోని ప్రైవేటు ఆలయాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సీఎస్ సూచించారు. పండుగలు, పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందో ప్రైవేటు ఆలయ నిర్వాహకులు ముందుగా అధికారులకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలపై కూడా అధికారులు ముందుగానే సమాచారం పొందాలని ఆదేశించారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని, అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని పేర్కొన్నారు.
Details
ధనుర్మాసం సందర్భాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం వంటి ప్రత్యేక పర్వదినాలు , పండుగల రోజుల్లో రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో, ప్రైవేటు ఆలయాలు అనుసరించాల్సిన చర్యలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి ఆలయాలకు జారీ చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రైవేటు ఆలయాలు మన పరిధి కావనే నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారుల్లో ఉండకూడదని హెచ్చరించారు. ప్రైవేటు ఆలయాల నిర్వహణ బాధ్యత నిర్వాహకులదే అయినప్పటికీ, రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుకు అధికారులు బాధ్యత వహించాలని ఆయన ఆదేశించారు. అలాగే ఆలయాల్లో పరిశుభ్రతను కచ్చితంగామరింత బలోపేతం చేయాలని, రద్దీ సమయంలో పారిశుధ్య లోపాలకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు. తొక్కిసలాటకు గురికాకుండా పటిష్ఠ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని కూడా ఆదేశించారు.