Telangana New Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో మీ పేరు లేకాపోతే ఇలా దరఖాస్తు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
వీటిలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రధానమైనదిగా ఉంది. రేషన్ కార్డు లభ్యం కావడం ద్వారా ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలలో చేరిక కుదురుతుంది.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తారు.
ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారి పూర్తి స్థాయి జాబితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే కొన్ని ప్రాంతాల్లో జాబితాలు లీక్ కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
జాబితాలో పేర్లు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. అర్హులను గ్రామ సభల్లోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం అందిన 12,07,558 దరఖాస్తుల్లో 18,00,515 కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులనూ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వివరాలు
6.68 లక్షల కార్డుల సమాచారం సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 మంది అర్హులకు సంబంధించిన 6,68,309 రేషన్ కార్డుల సమాచారాన్ని సిద్ధం చేశామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.
మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారం అవసరాన్ని అనుసరించి ప్రకటిస్తామని వెల్లడించారు.
నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలనే ఆదేశాలు కలెక్టర్లకు ఇచ్చినట్లు వివరించారు.
దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డులు, చిరునామా, ఫోన్ నంబర్, కుల వివరాలు సమర్పించాలని సూచించారు.
వివరాలు
జాబితాలో పేరు లేకుంటే ఏమి చేయాలి?
రేషన్ కార్డుల జాబితాలో పేరు లేకుంటే గ్రామ సభలో దరఖాస్తు చేయాలని సూచించారు.
సమర్పించిన వివరాలను అధికారులు పరిశీలించి అర్హత ఉన్నవారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. నగరాలు, పట్టణాల్లోనూ ఈ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కులగణనలో వచ్చిన సమస్యలు
సామాజిక ఆర్థిక కులగణన సమయంలో పలు చోట్ల రేషన్ కార్డుల సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని పేర్లు కంప్యూటరీకరణ సమయంలో జాబితాల నుంచి తొలగించబడినట్లు గుర్తించారు.
ప్రజలు తమ వివరాలు సరిచూసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డుల సంబంధిత సమస్యలపై పూర్తి స్పష్టత ఈ నెల 26న విడుదలవుతుందని అధికారులు తెలిపారు.
ఈ జాబితాలు ఏ ప్రతిపాదికన సిద్ధం చేశారనే విషయం కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు.