Andhra News: పర్యాటక ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసే ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తూనే, వాటిని నిర్ణీత గడువులో పూర్తిచేసే యజమానులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలనుకుంటోంది. పనులు ప్రారంభించిన తేదీ నుంచి ఏడాదిలోపే ప్రాజెక్టు పూర్తయితే స్థిర మూలధన పెట్టుబడి (ఎఫ్‌సీఐ)పై 2 శాతం ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఒకవేళ రెండేళ్లలోపు పూర్తి చేస్తే తగిన శాతం మేర ప్రోత్సాహకాన్ని అందించనుంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ, పలు రాయితీలతో కూడిన 2024-29 పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తర్వాత ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
వివరాలు
పీపీపీ విధానంలోనూ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు
ప్రైవేట్, ప్రభుత్వ రంగాల సహకారంతో పాటు పీపీపీ విధానంలోనూ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తోంది. గత ఎనిమిది నెలల వ్యవధిలో పర్యాటక రంగానికి సంబంధించిన 31 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం స్టార్ హోటళ్లు, రిసార్టులే. రూ.5 వేల కోట్లకు మించిన పెట్టుబడి అంచనాలతో ఇప్పటికే నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పరిశీలించిన అనంతరం పర్యాటకశాఖ ఖరారు చేసిన ప్రాజెక్టు విలువ ఆధారంగానే ప్రోత్సాహకాలు మంజూరు చేయనున్నారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు పూర్తయిన ప్రాజెక్టుల యజమానులు నిర్ణీత సమయంలో ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక రాయితీలు
పర్యాటక రంగంలో రూ.50 కోట్లలోపు పెట్టుబడితో చేపట్టే ప్రాజెక్టులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) కేటగిరీలోకి తీసుకొని వాటికీ ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఎఫ్‌సీఐపై 25 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. మైక్రో యూనిట్లకు గరిష్టంగా రూ.25 లక్షలు, చిన్న ప్రాజెక్టులకు రూ.1.5 కోట్లు, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.7.5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ উদ্যములకు అదనంగా మరో రూ.10 లక్షల ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
వివరాలు
పారిశ్రామిక హోదాతో లభించే ప్రయోజనాలు
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం వల్ల పరిశ్రమలకు వర్తించే అన్ని రాయితీలూ పర్యాటక ప్రాజెక్టులకు కూడా అమలవుతాయి. పరిశ్రమలకు ఉన్న విద్యుత్తు టారిఫ్ రేట్లే పర్యాటక ప్రాజెక్టులకూ వర్తించనున్నాయి. ఐదేళ్లపాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీని యూనిట్‌కు రూ.1గా పరిమితం చేస్తారు. అలాగే పరిశ్రమలపై అమలు చేస్తున్న ఆస్తి పన్ను, నీటి సరఫరా ఛార్జీలు, యూజీడీ ఫీజులు పర్యాటక ప్రాజెక్టులకూ వర్తిస్తాయి. పెట్టుబడులు,ఉపాధి కల్పన నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వం రాయితీలను నిర్ణయించనుంది.
వివరాలు
ఎస్క్రో ఖాతా ఏర్పాటు
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు నేరుగా అందేలా ప్రత్యేక ఎస్క్రో ఖాతాను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ విధానాన్ని రాష్ట్రంలో తొలిసారి అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వెల్లడించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు.