LOADING...
Telangana: నేటి నుంచే తెలంగాణలో 'సర్‌'.. జులై 24 వరకు ఇంటింటి సర్వే
నేటి నుంచే తెలంగాణలో 'సర్‌'.. జులై 24 వరకు ఇంటింటి సర్వే

Telangana: నేటి నుంచే తెలంగాణలో 'సర్‌'.. జులై 24 వరకు ఇంటింటి సర్వే

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి ఈ సర్వే ప్రారంభం కానుండగా, వచ్చే నెల 24 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కోసం జిల్లాల వారీగా ప్రతి ఓటరు పేరుతో రెండు ఎన్యూమరేషన్‌ పత్రాలను ముద్రించి సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఇంగ్లిష్‌లో, మిగిలిన జిల్లాల్లో తెలుగులో ఈ పత్రాలు అందించనున్నారు. ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం తమ బూత్‌ పరిధిలోని 50ఇళ్లను సందర్శించి ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్లందరికీ ఈ పత్రాలు పంపిణీ చేయనున్నారు. వాటిని పూర్తి చేసిన అనంతరం ఓటర్లు వచ్చే నెల 24లోపు తిరిగి బీఎల్‌వోలకు అందజేయాలి.

వివరాలు 

ఆన్‌లైన్‌లోనూ పత్రాల సమర్పణకు అవకాశం

ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు ఇప్పటికే మండలాల వారీగా బీఎల్‌వోలకు ప్రత్యేక శిక్షణ అందించారు. బీఎల్‌వోలు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించనున్నారు. ఓటరుకు రెండు ఎన్యూమరేషన్‌ పత్రాలు అందించి, వాటిని ఎలా పూరించాలో పూర్తిగా వివరిస్తారు. ఓటరు నింపిన రెండు పత్రాల్లో ఒకదాన్ని బీఎల్‌వో స్వీకరించగా, మరొకదాన్ని రసీదుగా తిరిగి అందిస్తారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఎన్యూమరేషన్‌ పత్రాలు అందుబాటులో ఉంటాయి. గురువారం నుంచి వీటిని ఆన్‌లైన్‌లో పూరించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం గతంలో నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌ లేదా ఎపిక్‌ (EPIC) కార్డు నంబర్‌ను ఉపయోగించి పోర్టల్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది.

వివరాలు 

1950 టోల్‌ఫ్రీ నంబర్

ఓటరు జాబితాలోని పేరు, ఆధార్‌ కార్డులోని పేరుతో సరిపోలిన వారికి మాత్రమే ఈ ఆన్‌లైన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పత్రాల పూర్తి చేయడంలో ఏవైనా సందేహాలు ఉన్నా, బీఎల్‌వో ఇంటికి రాకపోయినా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం పొందవచ్చు. ఎన్యూమరేషన్‌ పత్రాలను అందించే సమయంలో బీఎల్‌వోల వద్ద ఓటర్ల మ్యాపింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. మ్యాపింగ్‌ పూర్తయి ఉంటే ఎలా వివరాలు నమోదు చేయాలి, అన్‌మ్యాపింగ్‌ పరిస్థితిలో ఎలా పూరించాలో వారు ఓటర్లకు స్పష్టంగా వివరిస్తారు.

Advertisement

వివరాలు 

రంగంలోకి ప్రధాన రాజకీయ పార్టీలు

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు నియమించే బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)తో సమన్వయం చేసుకోవాలని ఇప్పటికే బీఎల్‌వోలకు అధికారులు సూచించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో బీఎల్‌వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లే సమయంలో సంబంధిత బీఎల్‌ఏలకు ముందస్తుగా సమాచారం అందజేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ బీఎల్‌ఏలకు అవసరమైన శిక్షణను పూర్తి చేశాయి. ఇప్పటివరకు 49,018 మంది బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల వివరాలను ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయానికి సమర్పించగా, మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారులకు (ఈఆర్వో) అందజేశాయి.

Advertisement