LOADING...
PM Modi: మోదీ పర్యటనకు ప్రత్యేక గుర్తింపు.. మలేషియాలో అరుదైన గౌరవ వందనం
మోదీ పర్యటనకు ప్రత్యేక గుర్తింపు.. మలేషియాలో అరుదైన గౌరవ వందనం

PM Modi: మోదీ పర్యటనకు ప్రత్యేక గుర్తింపు.. మలేషియాలో అరుదైన గౌరవ వందనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల మలేషియా పర్యటనలో బిజీ షెడ్యూల్‌తో ముందుకుసాగుతున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 8) తన పర్యటన రెండో రోజున కౌలాలంపూర్‌లోని పెర్దానా పుత్ర భవనంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, మంత్రులు, రెండు దేశాల ఉన్నత ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ గార్డుతో అధికారిక స్వాగతం పలికారు. తన పర్యటన మొదటి రోజునే భారత్-మలేషియా మధ్య ఉమ్మడి విలువలు, వేగంగా పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన ఆయన, నన్ను, నా ప్రతినిధి బృందాన్ని మీరు ఆత్మీయంగా స్వాగతించిన తీరు హృదయాన్ని హత్తుకుంది.

Details

సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు

కొద్ది గంటల వ్యవధిలోనే మలేషియా జీవనశైలిని, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలని అన్నారు. మీరు ఏర్పాటు చేసిన ఆతిథ్యం ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో నిలిచిపోతుందని పేర్కొంటూ, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు కౌలాలంపూర్‌లో జరిగిన సభలో వేలాది మంది భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్-మలేషియా సంబంధాలు నమ్మకం, సంస్కృతి, ఆర్థిక ఆశయాల ఆధారంగా కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాయని ఆయన తెలిపారు. భారతీయ ప్రవాసులను రెండు దేశాల మధ్య సజీవ వారధిగా అభివర్ణించారు. శతాబ్దాల నాటి తమిళ మూలాలు, ఉమ్మడి సంప్రదాయాలు, సాంస్కృతిక నిరంతరతను ఆయన గుర్తు చేశారు.

Details

ప్రశంసలతో ముంచెత్తిన మలేషియా ప్రధాని

ఈ సందర్భంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంను ప్రశంసలతో ముంచెత్తారు. మలేషియా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే IMPACT ఫ్రేమ్‌వర్క్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వాణిజ్యం, స్టార్టప్‌లు నుంచి రక్షణ, సాంకేతికత వరకు అన్ని రంగాల్లో భారత్ పురోగతి మలేషియా విజయంతో విడదీయరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 800 మందికి పైగా కళాకారులు పాల్గొన్న రికార్డు స్థాయి సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ప్రశంసిస్తూ, అది రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోతుందని అన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి ఆయన అభినందనలు తెలిపారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం తాను ప్రధానమంత్రి కాకముందు నుంచే తనకు స్నేహితుడని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

Advertisement

Details

ఈ ఏడాది ఇదే తొలి విదేశీ పర్యటన

సంస్కరణలపై అన్వర్ ఇబ్రహీం చూపుతున్న దృష్టి, ఆయన విశాలమైన అవగాహన, ఆసియాన్-2025కు సమర్థంగా అధ్యక్షత వహిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. గతేడాది మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరు కాలేకపోయినప్పటికీ, త్వరలో మలేషియాను సందర్శిస్తానని ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకున్నానని ప్రధాని మోదీ తెలిపారు. 2026లో ఇది తన తొలి విదేశీ పర్యటన అని పేర్కొన్నారు. పండుగల వేళ భారతీయ సమాజంతో కలిసి ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. సంక్రాంతి, పొంగల్, తైపూసం పండుగలు అందరూ సంతోషంగా జరుపుకుంటారని ఆకాంక్షించారు. అలాగే శివరాత్రి అనంతరం రంజాన్ ప్రారంభమవుతుందని, ఆపై హరిరాయ వేడుకలు జరుగుతాయని గుర్తు చేశారు. అందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

Advertisement