Manipur Hooch Tragedy: మణిపుర్‌లో కల్తీ మద్యం కలకలం.. మూడు రోజుల్లో 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత!
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ లో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని నింపింది. చందేల్ జిల్లాలో గత మూడు రోజులుగా కల్తీ మద్యం సేవించి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులు, మధ్య వయస్కులే ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
మూడు రోజుల్లో 12 మంది మృతి
నవంబర్ 18న ఐదుగురు, గురువారం ఒకరు, శుక్రవారం ఇద్దరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
అంతకుముందు నుంగ్‌పాన్ గ్రామంలో బుధవారం రాత్రి 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన మరణాలు వివిధ గ్రామాల్లో చోటుచేసుకున్నాయి.
కల్తీ మద్యం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది.
వివరాలు
కక్చింగ్ జిల్లా నుంచి కల్తీ మద్యం సరఫరా?
బాధితులు సేవించిన కల్తీ మద్యాన్ని పొరుగున ఉన్న కక్చింగ్ జిల్లాలోని సుగ్నూ ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చందేల్ జిల్లా మయన్మార్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో కంచె లేకపోవడంతో మద్యం అక్రమంగా రవాణా జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, కల్తీ మద్యం ఎక్కడ తయారైందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. మరోవైపు మృతుల సంఖ్యతో పాటు మరణాలకు కచ్చితమైన కారణాలను వైద్య, శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంది.
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.