Sri Chaitanya College : ఇంటర్ విద్యార్థిని ఆత్యహత్య.. కళాశాలపైనే తల్లిదండ్రుల అనుమానం
హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో విషాదం జరిగింది. ఈ మేరకు ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి ఒడిగట్టి కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చింది. పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వర్ష, బాత్ రూమ్'లో కర్రకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుండ్ల వ్యాపార గ్రామస్తురాలు, వర్ష శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇష్టంతోనే చేరింది. ఇంతలోనే తన చున్నీతో వేలాడుతూ కనిపించడం తోటి విద్యార్థినులను తీవ్ర ఆందోళనకు నెట్టేసింది. విషయాన్ని వెంటనే కాలేజీ యాజమాన్యానికి అందించగా, యాజమాన్యం హుటాహుటిన వర్ష మృతదేహాన్ని కిందికి దించారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు. కళాశాలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పిరికిది కాదు మా అమ్మాయి : బాధిత తల్లిదండ్రులు
ఇదే సమయంలో వర్ష ఆత్మహత్య సంఘటన మధ్యాహ్నం 12 గంటలకు జరిగితే తమకు 2 గంటలకు తెలియజేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ కూతురు పిరికి కాదని, అసలు ఏం జరిగిందో పూర్తిగా తమకు వివరాలు చెప్పాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాదిలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న దాఖలాలున్నాయని, ఇప్పుడు తమ కూతురు చనిపోవడానికి గల కారణాలు చెప్పాలని యాజమాన్యాన్ని నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టానికి పూనుకోవడంపై అనుమానాలు లేవనెత్తారు. తమ కూతురు చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువులోనూ తమ బిడ్డ బ్రిలియంట్ స్టూడెంట్ అని,చదువుపై ఇష్టంతోనే ఈ కాలేజీలో చేర్పించామని, ఇప్పుడు కూతురే లేకుండా పోయిందని బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.