LOADING...
TTD: టీటీడీలో 'శ్రీవారి వైద్యసేవ' ప్రారంభం.. నూతన కార్యక్రమానికి శ్రీకారం
టీటీడీలో 'శ్రీవారి వైద్యసేవ' ప్రారంభం.. నూతన కార్యక్రమానికి శ్రీకారం

TTD: టీటీడీలో 'శ్రీవారి వైద్యసేవ' ప్రారంభం.. నూతన కార్యక్రమానికి శ్రీకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో 'శ్రీవారి వైద్యసేవ' కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను తితిదే ఈవో ఎం. రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తొలిదశలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి, వైద్యుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజులపాటు, ఎంబీబీఎస్‌ వైద్యులకు ఏడు రోజులపాటు సేవలందించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు

తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాల

కార్యక్రమంలో పాల్గొనే వైద్యులకు తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలను తితిదే కల్పిస్తుందని తెలిపారు. తిరుమల అశ్విని ఆసుపత్రి, స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి తదితర తితిదే అనుబంధ వైద్య సంస్థల్లో ఈ సేవలు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూ మతానికి చెందిన వైద్యులు తితిదే వెబ్‌సైట్‌లో తమకు అనుకూలమైన స్లాట్‌ను బుక్‌ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని వివరించారు. కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌ ఐ హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ వెంకటాచలం, సికింద్రాబాద్‌ కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ఏ శాస్త్రి, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రాజేంద్రప్రసాద్‌ వర్చువల్‌గా హాజరై ఈవోతో మాట్లాడారు.

వివరాలు

తితిదే ఆస్పత్రుల్లో ఈ సేవలు

తితిదే ఆసుపత్రుల్లో సేవలందించే అవకాశం కల్పించడం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జేఈవోలు డాక్టర్‌ శరత్‌, వీరబ్రహ్మం, బర్డ్‌, స్విమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ జి. జగదీష్‌, డాక్టర్‌ ఆర్‌.వి. కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement