Indiramma Illu: కొత్త డిజైన్‌తో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేయడానికి ఏర్పాట్లను చేపడుతోంది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా,మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలస్యం అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని సర్కారు అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు ప్రారంభించింది. ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్లను కేటాయిస్తూ మంజూరు,కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలియచేసింది. ఈ ప్రణాళికపై మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా పని చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో హడ్కో నిబంధనలను అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో,అధికార యంత్రాంగం అన్ని సిద్ధతలను పూర్తి చేసుకుంది.
వివరాలు
ఇందిరమ్మ ఇళ్ల డిజైన్‌లో మార్పులు
దీని ప్రభావంగా, ఇందిరమ్మ ఇళ్ల డిజైన్‌లో మార్పులు జరిగే అవకాశముంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన డబుల్ బెడ్రూం డిజైన్‌లో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో రూ. 8,000 కోట్ల నిధులను రుణ రూపంలో మంజూరు చేయడానికి అంగీకరించింది. దీనికి అనుగుణంగా ఆ సంస్థ నిర్దేశించే మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మాదిరిగానే, కొత్త ఇళ్ల డిజైన్‌లో సింగిల్ బెడ్రూం,హాల్, కిచెన్ మరియు చిన్న వరండా వంటి అంశాలను కూడా ప్రతిపాదనలో చేర్చే అవకాశం ఉంది.