
Etala Rajender: రాష్ట్ర మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలి, కేంద్రంపై విమర్శలు ఆపాలి: ఈటల రాజేందర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణకు కేంద్రం నుంచి మరింత నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తామూ కోరుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీ ఎంపీలైనా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కావాల్సిన అనుమతులు, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో యూరియా సమస్య త్వరగా పరిష్కారం కావాలని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందని, అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేయడం తగదని ఆయన సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై సచివాలయంలో గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
Details
కనీసం రూ.12 లక్షలు ఇవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన దృష్టికి వచ్చిన కొందరు పేదల జాబితాను మంత్రి పొంగులేటికి అందజేశానని వెల్లడించారు. ఇందిరమ్మ పథకంలో రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించడం సాధ్యం కాదని, కనీసం రూ.12 లక్షల సహాయం ఇవ్వాలని ఈటల కోరారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి దొంగల అడ్డాగా మారుతున్నాయని విమర్శించారు. అలాగే, జవహర్‌నగర్‌లో మాజీ సైనికోద్యోగుల భూముల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు.