LOADING...
Andhra News: రాష్ట్ర మూలధన వ్యయం రూ.19,224 కోట్లు.. గణాంకాలు విడుదల చేసిన కాగ్
రాష్ట్ర మూలధన వ్యయం రూ.19,224 కోట్లు.. గణాంకాలు విడుదల చేసిన కాగ్

Andhra News: రాష్ట్ర మూలధన వ్యయం రూ.19,224 కోట్లు.. గణాంకాలు విడుదల చేసిన కాగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాలకే రాష్ట్ర పన్నుల ఆదాయం లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. తొలి తొమ్మిది నెలల్లో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.1,05,331.07కోట్లుగా నమోదైంది. రాష్ట్ర చరిత్రలో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ స్థాయి పన్నుల వసూళ్లు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ ఫీజులు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను,ఎక్సైజ్‌ సుంకం,కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా సహా ఇతర పన్నులన్నింటినీ కలిపి ఈ పన్నుల రాబడిగా లెక్కించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నుల ఆదాయం రూ.1,66,573.09 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేయగా,డిసెంబరు నాటికి అందులో 63.23శాతం వసూలైంది.

వివరాలు 

అభివృద్ధి పనులకు కీలకమైన మూలధన వ్యయంపైనా కాగ్‌ నివేదిక

జనవరి నుంచి మిగిలిన మూడు నెలల్లో మరో 36 శాతం వరకు పన్నులు సమీకరించగలిగితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరినట్లేనని అధికారులు భావిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి మూడు త్రైమాసికాల లెక్కలను కాగ్‌ మంగళవారం విడుదల చేసింది. అభివృద్ధి పనులకు కీలకమైన మూలధన వ్యయంపైనా కాగ్‌ నివేదిక స్పష్టతనిచ్చింది. ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక వసతుల నిర్మాణానికి కేటాయించే వ్యయాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత వేగంగా జరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.19,224 కోట్లను మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వ్యయం కావడం విశేషం.

వివరాలు ; 

ఆందోళనకర స్థాయికి రాష్ట్ర రెవెన్యూ లోటు

అయితే మొత్తం సంవత్సరానికి రూ.40 వేల కోట్లకు పైగా ఈ రూపంలో ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇప్పటివరకు దాదాపు సగం మేరకే పరిమితమైంది. అదే సమయంలో రాష్ట్ర రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరింది. డిసెంబరు చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85,312 కోట్ల రుణాలను సమీకరించినట్లు కాగ్‌ తెలిపింది. ఈ కాలానికి రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.60,480 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.33,185.97 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ముందుగా అంచనా వేయగా, వాస్తవ లోటు అంచనాలను మించి 182 శాతానికి చేరినట్లు లెక్కలు చూపుతున్నాయి. రెవెన్యూ ఆదాయం రూ.1,18,244.98 కోట్లుగా ఉండగా, రెవెన్యూ వ్యయం మాత్రం రూ.2,03,557.29 కోట్లుగా ఉన్నట్లు కాగ్‌ తుది గణాంకాలు వెల్లడించాయి.

Advertisement