LOADING...
ANGRAU: ముద్ద అన్నానికి చెక్‌… ఆవిరి బియ్యమే పరిష్కారం.. ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి 
ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

ANGRAU: ముద్ద అన్నానికి చెక్‌… ఆవిరి బియ్యమే పరిష్కారం.. ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంతకుముందు రైతులు వరి పంటను కోసిన తర్వాత పనలు ఆరబెట్టి, కుప్పలుగా వేసి రెండు నుంచి మూడు నెలల పాటు మాగనిచ్చేవారు. ఆ తరువాత నూర్పిడి చేసి, మరపట్టించి వచ్చిన బియ్యంతో అన్నం వండుకుని తినేవారు. అయితే కూలీల కొరత, పంటల సాగు విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం యంత్రాలతో వరి కోత జరుగుతోంది. అధిక తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండానే మరపట్టించడంతో బియ్యం నాణ్యత తగ్గిపోతోంది. వడ్లను వెంటనే మిల్లింగ్‌ చేయడం వల్ల వండిన అన్నం ముద్దగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆవిరి ద్వారా ధాన్యాన్ని ఉడికించి బియ్యం తయారు చేసే విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది.

వివరాలు 

ధాన్యంలో ఉన్న పొట్టు, తవుడులోని పోషకాలు బియ్యపు గింజలోకి..

మధ్యస్థ, సన్నరకాల వడ్లను కూడా తక్కువ కాలం నిల్వ ఉంచి మరపట్టిస్తే అన్నం ముద్దవుతుందని, ఆవిరితో ఉడికించిన బియ్యమే దీనికి సరైన పరిష్కారమని ఆంగ్రూ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వరి కోసిన వెంటనే ధాన్యాన్ని ఆవిరితో ఉడికించి, ఆ తరువాత చల్లబరచి మరపట్టిస్తే నిల్వ చేయకపోయినా అన్నం తినడానికి అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానంలో ధాన్యంలో ఉన్న పొట్టు, తవుడులోని పోషకాలు బియ్యపు గింజలోకి చేరుతాయి. పచ్చిబియ్యంతో పోలిస్తే ఇందులో ఫైబర్‌, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియను అనుసరిస్తే రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వంటి పనులు అవసరం ఉండవు.

వివరాలు 

ఆవిరి బియ్యం వాడకంతో పలు ప్రయోజనాలు

ఆవిరి బియ్యం వాడకంతో పలు ప్రయోజనాలు లభిస్తాయి. వండిన అన్నం పొడిగా ఉండి ముద్దగా మారదు. మూడు నుంచి నాలుగు గంటల వరకు అన్నం రుచి, నాణ్యత అలాగే నిలుస్తాయి. అన్నం గట్టిపడకుండా, నీరు కారకుండా, చెడిపోకుండా ఉంటుంది. అమైలోజ్‌ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత, విటమిన్‌ 'బి' లోపం తగ్గడంలో సహాయపడుతుంది. పిల్లల్లో ఆరోగ్యం మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పాలిషింగ్‌ సమయంలో సూక్ష్మపోషకాల నష్టం కూడా తక్కువగా ఉంటుందని వెల్లడించారు.

Advertisement