Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్ షా కీలక అదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని బుధల్ గ్రామంలో మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ బృందం ప్రభావిత గ్రామాన్ని సందర్శించి, మరణాలకు గల కారణాలను తెలియజేయనుంది. ఈ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి నేతృత్వం వహించనున్నారు.
ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వ్యవసాయ, రసాయనాలు, ఎరువులు, జలవనరుల మంత్రిత్వ శాఖల నిపుణులు ఉంటారు.
ఈ దర్యాప్తు బృందానికి పశుసంవర్ధక, ఆహార భద్రత, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిపుణులు కూడా సహకరించనున్నారు.
Details
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మృతి
జనవరి 19న ఈ బృందం తన పర్యటనను ప్రారంభించి, గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తుంది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టడానికి స్థానిక పరిపాలనతో కలిసి పని చేయనుంది.
గత 45 రోజుల్లో, రాజౌరి జిల్లాలోని బుధల్ గ్రామంలో 16 మంది మర్మమైన వ్యాధి కారణంగా మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉండడం గమనార్హం.
బాధితుల్లో జ్వరం, నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించగా, కొందరు ఆసుపత్రిలో చేరి కొద్దిరోజుల్లో మరణించారు.
Details
పిల్లలపై ఎక్కువ ప్రభావం
ముఖ్యంగా పిల్లలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపగా, 80 ఏళ్ల వృద్ధురాలు కూడా ఈ వ్యాధి కారణంగా మరణించింది. ప్రస్తుతం, ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
గత నెలలో వ్యాధి తొలుత గుర్తించినప్పుడు వందలాది నమూనాలను ఆరోగ్య శాఖ ప్రయోగశాలకు పంపించారు.
కానీ ఇప్పటివరకు ఎటువంటి వైరస్ లేదా వ్యాధిని గుర్తించలేకపోయారు.
ఈ ఘటనపై దృష్టి సారించి, దేశంలోని ప్రముఖ సంస్థల నిపుణుల సాయంతో మరణాలకు గల అసలు కారణాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.