LOADING...
Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!
మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!

Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణీ సంగమంలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. కేవలం ఆధ్యాత్మిక అనుభవాలకే కాదు, అనేక విచిత్రమైన ఘటనలకు కూడా ఈ కుంభమేళా వేదికైంది.

Details

పూసలమ్ముకునే మోనాలిసా - రాత్రికి రాత్రే స్టార్ 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా భోస్లే, పూసల దండలు అమ్ముతూ మహాకుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు తోడుగా పూసల దండలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఆమె అమాయకపు ముఖచిత్రం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు విపరీతంగా పాపులర్ కావడంతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను 'డైరీ ఆఫ్ మణిపూర్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు అవకాశం కల్పించారు.

Details

ఐఐటీ బాబా - ఇంజినీరింగ్ నుంచి ఆధ్యాత్మికత వరకు 

హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆయనను 'ఐఐటీ బాబా'గా పిలుస్తున్నారు. ఫోటోగ్రఫీ, ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన, ప్రస్తుతం శివుడిని ఆరాధిస్తూ ధ్యానం, యోగాలో తలమునకలై జీవనాన్ని సత్ఫలంగా మారుస్తున్నారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Details

మహామండలేశ్వర్‌గా మమతా కులకర్ణి

1990ల బాలీవుడ్ స్టార్ మమతా కులకర్ణి, సినిమాలకు గుడ్‌బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయారు. మహాకుంభమేళా సందర్భంగా ఆమె తిరిగి భారత్‌కు వచ్చి కిన్నెర అఖాడాలో చేరారు. తన పేరును 'మాయీ మమతానంద్ గిరి'గా మార్చుకున్న ఆమె, మహామండలేశ్వర్‌గా నియమితులయ్యారు. అయితే, మతపెద్దలు, అఖాడాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ నియామకాన్ని రద్దు చేసి, ఆమెను బహిష్కరించారు. డిజిటల్ స్నానం దూరప్రాంతాల భక్తుల కోసం దీపక్ గోయల్ అనే వ్యక్తి వినూత్నంగా 'డిజిటల్ స్నాన్' సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తులు వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపితే, వర్చువల్‌గా సంగమంలో పుణ్యస్నానం చేయించినట్లు భావించేలా ఈ సేవను రూపొందించారు. ఈ డిజిటల్ స్నానం కోసం రూ.1,100 ఛార్జ్ విధించారు.

Details

భర్తకు వీడియోకాల్ చేసి ఫోన్‌ను గంగలో ముంచిన మహిళ

కుంభమేళాకు రావలసిన భర్త రాలేకపోవడంతో, ఓ మహిళ అతనికి డిజిటల్ పవిత్ర స్నానం చేయించింది. వీడియో కాల్ ద్వారా భర్తను మాట్లాడించుకుంటూ, తన ఫోన్‌ను గంగలో ముంచి అతనికి పవిత్రస్నానం చేసే అవకాశం కల్పించింది. ఈ ఘటన చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కండల బాబా - ఫిట్‌నెస్‌తో ఆకర్షించిన విదేశీ సాధువు మహాకుంభమేళాకు హాజరైన సాధువులలో ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అనే ఓ విదేశీ సాధువు తన మస్కులార్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏడు అడుగుల ఎత్తు, బలమైన శరీరంతో ఈ 'కండల బాబా' సోషల్‌మీడియాలో వైరల్ అయ్యారు. కొందరు ఆయన్ను ఆధునిక యుగానికి చెందిన పరుశరాముడిగా అభివర్ణిస్తున్నారు.

Details

 విషాద ఘటనలు 

45 రోజులపాటు సాగిన కుంభమేళాలో ఆధ్యాత్మికత మాత్రమే కాదు, కొన్ని విషాద ఘటనలూ చోటుచేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మరణించగా, అనేక మంది గాయపడ్డారు. అంతేకాదు, రైల్వే స్టేషన్లలో, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విధంగా, మహాకుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతులను అందించడమే కాక, అనేక ఆశ్చర్యకరమైన ఘటనలతో వార్తల్లో నిలిచింది.