భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే..
చైనాలో కరోనా విజృంభించడానికి కారణమైన BF.7 వేరియంట్.. భారత్‌ను సైతం వణికిస్తోంది. దేశంలో నాలుగు కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే నిపుణులు మాత్రం భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. భారత్‌లో నమోదైన నాలుగు కేసులు కూడా.. తాజాగా వచ్చినవి కావని, జూలై, సెప్టెంబర్, నవంబర్‌లో కనుగొనబడినట్లు చెబుతున్నారు. BF.7 అనేది ఒమిక్రాన్ BA.5 నుంచి పుట్టుకొచ్చిన ఉపరకం. దేశంలో పది కరోనా వేరియంట్లు ఉండగా.. అందులో BF.7 ఒకటి. అయితే ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లలో ఇది బలమైన ఇన్‌ఫెక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
'వైరస్ సోకినా.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు'
వాస్తవానికి భారత్‌లో జూలైలో BF.7 వేరియంట్‌ను గుర్తించారు. అయితే ఆ తర్వాత వేరియంట్ కేసులు సంఖ్య పెరగకపోవడం గమనార్హం. చైనాలో మాదిరిగా భారత్‌లో ఈ వేరియంట్ అంతగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. BF.7 సోకిన వారు.. హోమ్ ఐసోలేషన్‌లో కోలుకున్నారని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటికే మూడు డోసులు పూర్తికావడం, హెర్డ్ ఇమ్యూనిటీ కారణంగా మరో వేవ్‌కు ఆస్కార్ లేదని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాలో హెర్డ్ ఇమ్యూనిటీ లేకపోవడం.. తరుచూ లాక్ డౌన్ వల్ల వారిలో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందలేదని అభిప్రాయపడుతున్నారు. వేగంగా విస్తరించే సామర్థ్యం ఉన్న ఈ వేరియంట్‌కు రీ ఇన్ఫెక్షన్ సామర్థ్యం ఉన్న నేపథ్యంలో.. ఆ కోణంలోనే భయపడాల్సి వస్తోందని చెబుతున్నారు.