UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి అందజేసిన పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్ హర్దోయ్‌లోని పోలీసులు ఇటీవల తమ సాధారణ డ్యూటీకి భిన్నంగా ఓ ప్రత్యేకమైన కేసును చేధించారు. హత్యలు, దోపిడీలు వంటి కేసుల వ్యవహారాల్లో నిత్యం మునిగిపోయే వారు, ఓ చిన్నారిని ఆనందంగా చూసేందుకు ఓ చిన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. స్కూల్‌లో తన షార్ప్‌నర్ పోయిందని ఓ విద్యార్థి ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. హర్దోయ్‌లోని పాఠశాలల్లో పిల్లల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా 'పింక్ బాక్స్‌లు' ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ స్కూల్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లేఖలు రాస్తే, అవి పరిష్కరించే బాధ్యతను పోలీసులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి తన ఫిర్యాదుగా తన షార్ప్‌నర్ పోయిందని పేర్కొన్నాడు.
పోలీసుల చర్యలపై హర్షం
పోలీసులు ఆ ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశోధన ప్రారంభించారు. చివరకు ఆ షార్ప్‌నర్‌ను గుర్తించి, అసలైన యజమానిని చేరవేశారు. తమ ఫిర్యాదు న్యాయం పొందడంతో చిన్నారి ఆనందానికి హద్దులు లేకపోయాయి. హర్దోయ్ పోలీసుల చొరవపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం ద్వారా వారికి చట్టంపై విశ్వాసం పెరుగుతుందని, చిన్నప్పటి నుంచే సమాజం పట్ల బాధ్యతాభిప్రాయాలు కలుగుతాయని తాము నమ్ముతున్నామని పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో నైతిక విలువలను పెంచుతాయని, చట్టాన్ని గౌరవించే అలవాటును క్రమంగా పెంచుతాయని కొందరు కొనియాడారు.