UGC: విద్యార్థులు డిగ్రీ కోర్సు వ్యవధిని మార్చుకోవచ్చు.. యూజీసీ కొత్త విధానం
డిగ్రీ పూర్తిచేసుకోవాలంటే ఇక మూడు లేదా నాలుగేళ్ల పాటు వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సు వ్యవధిని తగ్గించుకునే లేదా పెంచుకునే అవకాశం ఇప్పుడు లభించనుంది. ఈ కొత్త మార్గాన్ని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. యూజీసీ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, ఉన్నత విద్యాసంస్థలు యాక్సెలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ADP) ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (EDP) కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆమోదం పొందాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, విద్యార్థులు తమ మొదటి లేదా రెండో సెమిస్టర్ ముగియేలోపు ADP లేదా EDP కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
విద్యాభ్యాసంలో కొత్త ఒరవడి
విద్యాసంస్థలలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీలు ఈ దరఖాస్తులను సమీక్షించి, ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తాయి. ADP కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌లో అదనపు క్రెడిట్లు సంపాదించాలి. మరోవైపు, EDP కోర్సు ఎంపిక చేసుకున్నవారు తక్కువ క్రెడిట్లు మాత్రమే సంపాదించవచ్చు. అయితే, వీరికి ఇచ్చే డిగ్రీలు కూడా సాధారణ డిగ్రీలతో సమానమైన విలువ కలిగి ఉంటాయి. ఈ విధానం విద్యార్థుల విద్యాభ్యాసంలో కొత్త ఒరవడిని ఏర్పరచనుంది.