ఉత్తర్‌ప్రదేశ్: విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. సీఎంకు రక్తంతో లేఖ రాసిన బాలికలు
తమ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఓ పాఠశాల విద్యార్థులు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాశారు. ఘజియాబాద్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండే విద్యార్థినులను వేర్వేరు సాకులతో తరుచూ తన కార్యాలయానికి పిలిపించుకొని అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు అమ్మాయిలు తమ ఆవేదనను లేఖలో వెలిబుచ్చారు. ఏడు నుంచి పదోతరగతి చదువుతున్న 12 -15ఏళ్ల వయస్సు గల బాలికలను ప్రిన్సిపాల్ లైంగింకంగా వేధిస్తున్నాడు. దీంతో మొదట ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయపడ్డ విద్యార్థినులు, ఆ తర్వాత చివరికి వారి తల్లిదండ్రులకు వివరించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
విద్యార్థుల తల్లిదండ్రులు- ప్రిన్సిపాల్ పరస్పరం ఫిర్యాదు
బాలికల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ అసభ్యపదజాలంతో తిట్టారు. అనంతరం తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పాఠశాలలోకి అక్రమంగా చొరబడి ఆస్తులను ధ్వంసం చేసి, తనపై దాడి చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో తమను పోలీసులు నాలుగు గంటలపాటు పోలీసులు స్టేషన్లలో ఉండవల్సి వచ్చిందని, బాలికలు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.