తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రాబోయో మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు తమ పంటలను, పశువులను వర్షాల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ రైతులకు సూచించింది. బుధవారం నుంచి శుక్రవారం వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
హైదరాబాద్‌లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ జిల్లాలు ఎల్లో అలర్ట్ జాబితో ఉన్నట్లు చెప్పింది. ఉరుములతో కూడిన జల్లుల పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఫలితంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్‌లో బుధ, గురువారాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.