ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలోనే గత 122 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 29.54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు, 1901 తర్వాత ఆ స్థాయిలో ఎండలు కొట్టడం ఇదే తొలిసారని పేర్కొంది.
అంతేకాదు మార్చి, ఏప్రిల్, మే నెల్లలోని ఎండల తీవ్రతను కూడా ఐఎండీ అంచనా వేసింది.
ఈశాన్య, తూర్పు, మధ్య,వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపశమనం కోసం 'ఏం చేయాలి, ఏం చేయకూడదు' అనే జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఎండలు
విద్యుత్ నెట్‌వర్క్, పంటలపై తీవ్ర ప్రభావం
అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ నెట్‌వర్క్‌పై భారం పడుతుంది.
సాధారణ ఉష్ణోగ్రత స్థాయిలతో పోలిస్తే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కాలాన్ని హీట్‌వేవ్‌గా వర్గీకరిస్తారు. 2015- 2020 మధ్య హీట్‌వేవ్‌ల వల్ల ప్రభావితమైన రాష్ట్రాల సంఖ్య 23కి పెరిగింది. అంటే రెండింతలు పెరిగింది.
దేశవ్యాప్తంగా నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో అత్యధికంగా నమోదయ్యాయి.
ఎండలు పంట దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణుపు చెబుతున్నారు. ముఖ్యంగా గోధుమ పంట దిగుబడి భారీ తగ్గే అవకాశం ఉంది.
చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా భారతదేశం ఉంది. ఈ క్రమంలో ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.