Sunetra Pawar: బారామతి ఉపఎన్నికలో సునేత్ర పావార్ ఆధిక్యం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని బారామతి ఉపఎన్నికలో జాతీయవాద కాంగ్రెస్ పార్టీకి చెందిన సునేత్ర పావార్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో బారామతి స్థానంలో తాజా ఓట్ల లెక్కింపులో సునేత్ర పావార్ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం వెలువడింది. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి సునేత్ర పావార్ రంగంలోకి దిగారు. భర్త మృతి అనంతరం ఆమెను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
వివరాలు
మహారాష్ట్రలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
దీంతో పదవి కొనసాగించాలంటే నిర్దిష్ట గడువులోగా ప్రజల తీర్పును సాధించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె విజయం సాధించడం అత్యంత ముఖ్యమైంది. ప్రస్తుతం లభిస్తున్న సమాచారాన్ని బట్టి సునేత్ర పవార్ బలంగా పోటీ ఇస్తూ ముందంజలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో భాగల్‌కోట్, దేవనగరి, మహారాష్ట్రలో బారామతి, రాహురి, నాగాలాండ్‌లో కొరిడంగ్, త్రిపురలో ధర్మనగర్, గుజరాత్‌లో ఉమ్రేత్ స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడు స్థానాల్లో ఐదు చోట్ల భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.