సన్నీ డియోల్ బంగ్లా వేలం నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్ విమర్శలు
బీజేపీ ఎంపీ,బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ విల్లాను ఈ-వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సాంకేతిక కారణాల వల్ల నోటీసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సన్నీడియోల్ 2022 డిసెంబర్ నుండి జరిమానా,వడ్డీతో సహా మొత్తం రూ.55.99 కోట్ల రుణం బాకీ పడ్డారని,ఇందుకు సంబంధించి ముంబై జుహూ ప్రాంతంలో ఉన్న ఆయన విల్లాను రూ.51.43 కోట్ల రిజర్వ్ ధరకు ఆగష్టు నెల 25న ఈ-వేలం వేయనున్నట్టు బ్యాంకు అఫ్ బరోడా ఆదివారం నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా విల్లాతో పాటు 599.44 చ.మీలలో గ్యారంటీదారుగా ఉన్న ఆయన తండ్రి ధర్మేంద్ర భవనాలను కూడా వేలం వేస్తున్నట్టుపేర్కొంది. బ్యాంకు వేలం వేస్తామని నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవక ముందే నోటీసులను ఉపసంహరించుకోవడం గమనార్హం.
బ్యాంకు నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్ సీనియర్ నేత వ్యంగ్య ట్వీట్
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. బ్యాంకు లో సాంకేతిక కారణాలు ఎవరి వల్ల తలెత్తాయోనని పార్టీ సీనియర్ నేత జయ్‌రామ్ రమేశ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బాకీ పడిన రూ.56 కోట్లను చెల్లించాలని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు చెందిన జుహూలోని నివాసాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ-వేలానికి ఉంచినట్లు నిన్న మధ్యాహ్నం యావత్ దేశానికి తెలిసింది. అయితే 24 గంటలలోపే సాంకేతిక కారణాల వల్ల వేలం నోటీసును బీవోబీ ఉపసంహరించుకున్నట్లు దేశానికి తెలిసింది. మరి ఈ 'సాంకేతిక కారణాలను' ఎవరు ప్రేరేపించారని ఆశ్చర్యపోతున్నారా?' అంటూ సామాజిక మాద్యమం ఎక్స్ లో జైరాం రమేష్ పోస్టు చేశారు.