
తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో భానుడు భగభమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 40డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో మరో ఐదు రోజులకు సంబంధించిన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ- హైదరాబాద్ వెల్లడించింది.
తెలంగాణలోని జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని ఐఎండీ చెప్పింది. పలు జిల్లాల్లో సాధారణం కంటే రెండు నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఎండలు పెరిగినట్లు వాతావరణ శాఖ చెప్పింది. దీంతో రాబోయే రోజుల్లో ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణ
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 40 డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఆదిలాబాద్‌లో 44.3 ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కొత్తగూడెంలోని జూలురుపాడులో 43.8 డిగ్రీలు రికార్డు అయినట్లు ఐఎండీ వివరించింది.
ఆదిలాబాద్‌లోని అర్లీ టీలో 43.1, మంచిర్యాలలోని కొమ్మెరలో 43 డిగ్రీలు, కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో 42.9 డిగ్రీలు, వనపర్తి జిల్లాలోని కానాయిపల్లిలో 42.8డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని జైనాలో 42.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలోని ముప్కల్‌లో 42.6 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు.