LOADING...
Raiways Compensation: సమయానికి రాని సూపర్‌ఫాస్ట్‌ రైలు.. పరీక్ష మిస్‌ కేసులో రూ.9 లక్షల పరిహారం
సమయానికి రాని సూపర్‌ఫాస్ట్‌ రైలు.. పరీక్ష మిస్‌ కేసులో రూ.9 లక్షల పరిహారం

Raiways Compensation: సమయానికి రాని సూపర్‌ఫాస్ట్‌ రైలు.. పరీక్ష మిస్‌ కేసులో రూ.9 లక్షల పరిహారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్ల ఆలస్యం కారణంగా నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ విద్యార్థినికి ఈ ఆలస్యం ఆమె కెరీర్‌పైనే తీవ్ర ప్రభావం చూపింది. రైలు సమయానికి రాకపోవడంతో కీలకమైన ప్రవేశ పరీక్షను మిస్సైన ఆ విద్యార్థిని న్యాయపోరాటానికి దిగగా.. దాదాపు ఏడేళ్ల అనంతరం ఆమెకు న్యాయం లభించింది. రైలు ఆలస్యానికి పరిహారంగా ఆమెకు రూ.9.10లక్షలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయడానికి ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్‌ రైలులో ప్రయాణం బుక్‌ చేసుకుంది.

Details

రెండున్నర గంటలపాటు ఆలస్యం

బస్తీ నుంచి లఖ్‌నవూకు ఉదయం 11గంటలకు రైలు చేరాల్సి ఉండగా, అది దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. పరీక్షా కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటల వరకే విద్యార్థులను అనుమతించడంతో, సమృద్ధి పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయింది. రైలు ఆలస్యం కారణంగా తనకు ఒక విద్యా సంవత్సరం నష్టం వాటిల్లిందని పేర్కొంటూ సమృద్ధి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ నష్టానికి పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని ఆమె పిటిషన్‌లో కోరింది. దీనిపై స్పందించిన కమిషన్‌ రైల్వే మంత్రిత్వశాఖకు నోటీసులు జారీ చేసింది. రైలు ఆలస్యమైన విషయాన్ని రైల్వే శాఖ ధ్రువీకరించినప్పటికీ, ఆలస్యానికి సరైన కారణాన్ని మాత్రం వివరించలేకపోయింది.

Details

45 రోజుల్లోగా రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాలి

దాదాపు ఏడేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం తాజాగా జిల్లా వినియోగదారుల కమిషన్‌ తుది ఉత్తర్వులు వెలువరించింది. రైలు ఆలస్యం వల్ల విద్యార్థినికి నష్టం జరిగినట్లు నిర్ధారించిన కమిషన్‌ 45 రోజుల్లోగా రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. ఈ తీర్పు రైలు ఆలస్యాలపై ప్రయాణికుల హక్కులను మరోసారి గుర్తు చేసే ఉదాహరణగా నిలిచింది.

Advertisement