Page Loader
MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన
మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన

MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025-26 వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు తెలంగాణ రైతులకు నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది. పెరిగిన సాగు వ్యయానికి అనుగుణంగా పంటలకి సరైన మద్దతు ధరలు లభిస్తాయని రైతులు భావించినప్పటికీ, కేంద్రం ప్రకటించిన ధరలు వారి అంచనాలను తల్లకిందలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను కూడ కేంద్రం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జాతీయ వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ)కి పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించలేదని అధికార వర్గాల ఆవేదన వ్యక్తమైంది.

Details

ఖర్చులు పెరిగినా మద్దతు ధరలు తగిన స్థాయిలో లేవు

పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, పెసలు, మినుములు వంటి నూనె గింజలు, పప్పుదాణ్యాలకు రాష్ట్రం సిఫార్సు చేసిన మేరకు ధరలు పెరగలేదు. తాము పెట్టే ఖర్చుల కంటే మద్దతు ధరలు తక్కువగానే ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు పంటల సాగు వ్యయం సంవత్సరానికి 10 శాతానికి పైగా పెరుగుతున్నదని చెబుతున్నారు. కూలీలు, యంత్రాల అద్దె, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రవాణా ఖర్చుల వల్ల సాగు వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ, మద్దతు ధరలు ఆ స్థాయిలో పెరగకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. నల్గొండ జిల్లా రైతు సైదులు మాట్లాడుతూ, ''కేంద్రం ప్రకటించిన ధరలు అశాస్త్రీయంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగినా మద్దతు ధరలు తగిన స్థాయిలో లేవు.

Details

రైతులకు తీవ్ర నష్టం

ఇది రైతులకు తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుంది'' అని వాపోయారు. మరోవైపు, మార్కెట్‌ ధరలతో పోలిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు తక్కువగా ఉన్నాయని కూడా రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్‌ యార్డుల్లో వరి (సాధారణ)కు క్వింటాకు రూ.2,500, ఏ-గ్రేడ్‌ రకం వరికి రూ.2,680, పత్తికి రూ.8,000, మొక్కజొన్నకు రూ.3,000, కందికి రూ.9,800-10,000, మినుములకు రూ.7,090-7,580, వేరుసెనగకు రూ.8,500 వరకు ధరలు లభిస్తున్నాయి. ఈ ధరలన్నీ మద్దతు ధరలకంటే ఎక్కువగానే ఉండటంతో రైతుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా అసంతృప్తి వెల్లివిరుస్తోంది.