Sonam Wangchuk: పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి.. ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ కీలక సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తన మద్దతుదారులకు కీలక పిలుపునిచ్చారు. సోమవారం (జులై 20) నిర్వహించనున్న 'పార్లమెంట్ మార్చ్' (పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీ)ను విజయవంతం చేయాలని కోరారు. తనను ఆస్పత్రిలో అక్రమంగా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌లో 21 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్‌ను పోలీసులు దీక్షను విరమింపజేసి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెల్ల కాగితంపై స్వయంగా రాసిన సందేశాన్ని ఆయన భార్య గీతాంజలి ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు. తన సందేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (జులై 20) నిర్వహించనున్న 'పార్లమెంట్ మార్చ్'లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మద్దతుదారులను వాంగ్‌చుక్ కోరారు.
వివరాలు
పోలీసులు అనుమతి ఇవ్వలేదు
నిర్భయమైన భారతదేశం నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తన నిరాహార దీక్షతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న 'పార్లమెంట్ మార్చ్' కూడా అన్యాయానికి వ్యతిరేకంగా, న్యాయం కోసం చేస్తున్న ఉద్యమమేనని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈ 'పార్లమెంట్ మార్చ్'కు దిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం.
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
వివరాలు
వైద్యుల పర్యవేక్షణలో వాంగ్‌చుక్
ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
సుదీర్ఘకాలం పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో స్వల్ప స్థాయి సమస్యలు తలెత్తాయని వైద్యులు తెలిపారు.
మరోవైపు దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలం నుంచి వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.