Supreme Court: గృహిణులు దేశ నిర్మాతలు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గృహిణుల శ్రమకు మరింత గుర్తింపు కల్పించేలా సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఇంటి పనులు, కుటుంబ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించే గృహిణులను "దేశ నిర్మాతలు"గా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం, రోడ్డు ప్రమాదాల్లో గృహిణి మరణిస్తే పరిహారం లెక్కించే సమయంలో ఆమె చేసే గృహ సేవలకు కనీసం నెలకు రూ.30 వేల ఆదాయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. పంజాబ్‌లో 2001 నవంబర్‌లో రేష్మా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనకు సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటిశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రేష్మా మరణానంతరం ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి పరిహారం కోరారు.
వివరాలు
బాధిత కుటుంబం పరిహారం కోసం ఎదురుచూడాల్సి రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన
2003లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ, న్యాయపోరాటం కొనసాగి చివరకు 2024 డిసెంబరులో పంజాబ్-హర్యానా హైకోర్టు అప్పీల్‌ను పరిష్కరించింది. ప్రమాదం జరిగిన రెండు దశాబ్దాల తర్వాత కూడా బాధిత కుటుంబం పరిహారం కోసం ఎదురుచూడాల్సి రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు గృహిణుల ఊహాజనిత ఆదాయాన్ని నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనాలతో పోల్చే విధానం అమలులో ఉండేదని, అయితే అది ఇంటి పనుల అసలు ఆర్థిక, సామాజిక విలువను ప్రతిబింబించదని ధర్మాసనం పేర్కొంది. గృహ సేవలను సాధారణ కార్మిక శ్రమతో సమానంగా చూడలేమని స్పష్టం చేసింది.
వివరాలు
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణయించాలి
తీర్పు సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్ మాట్లాడుతూ,గృహిణుల వల్ల కుటుంబం,సమాజం బలపడుతుందని,వారిని "దేశ నిర్మాతలు"గా గుర్తించే సమయం వచ్చిందన్నారు. గృహ సేవల వల్ల కలిగే నష్టానికి నెలకు కనీసం రూ.30వేల విలువ కేటాయించాలని,దీనికి అదనంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 'ప్రణయ్ సేథి' తీర్పులో పేర్కొన్న ఇతర పరిహార నిబంధనలు కూడా వర్తిస్తాయని వెల్లడించారు. మోటారు వాహనాల చట్టం కింద ప్రమాద పరిహారం నిర్ణయించేందుకు 'నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వర్సెస్ ప్రణయ్ సేథి' కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే మార్గదర్శకాలను నిర్దేశించింది. భవిష్యత్ ఆదాయ అవకాశాలు,ఇతర సంప్రదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణయించాలని ఆ తీర్పు పేర్కొంది. ఇప్పుడు గృహిణుల గృహసేవలకు నెలకు రూ.30వేల కనీస విలువను కూడా ఆ ప్రమాణాలతో పాటు పరిగణించనున్నారు.
వివరాలు
ప్రమాద పరిహార కేసులను ఏడాది లోపే పరిష్కరించేలా తీసుకోవాలని సూచన
ఇంతకుముందు 'కీర్తి వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్' (2021), 'అరుణ్ కుమార్ అగర్వాల్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్' (2010) కేసుల్లో కూడా వేతనం రాకపోయినా గృహిణుల సేవలకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాజా తీర్పు ఆ అభిప్రాయాలను మరింత బలపరిచినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా, మోటార్ ప్రమాద పరిహార కేసుల విచారణలో జాప్యంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షేమ లక్ష్యంతో రూపొందిన మోటారు వాహనాల చట్టం ప్రయోజనం బాధిత కుటుంబాలకు దశాబ్దాల తర్వాత పరిహారం అందితే నెరవేరదని పేర్కొంది. ప్రమాద పరిహార కేసులను ఏడాది లోపే పరిష్కరించేలా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించి అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకోవాలని సూచించింది.