LOADING...
SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక
రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి. పన్నులు చెల్లించే వర్గాల్లో కొందరు మాత్రం వీటిని వ్యతిరేకిస్తారు.మరికొందరు నిజంగా అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనాలు అందాలని సూచిస్తారు. ఈ విధంగా ఉచిత పథకాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే,అనేక సందర్భాల్లో అర్హులతో పాటు అనర్హులూ ఈ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. దీంతో పథకాల అసలు లక్ష్యం దెబ్బతింటోంది.అదనంగా ప్రభుత్వాలపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాలు పెద్దగా ఆర్థిక లోటు లేకుండా పాలన సాగించగలిగేవి.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పథకాల అమలుకోసం ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తోంది.ఇదే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

వివరాలు 

స్వయం సంపత్తిని పెంచే మార్గాలను అందించడమే సముచితం 

ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు,ఉచిత విద్యుత్ పథకాలపై విచారణ సందర్భంగా సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పాంచోలి ఉన్న ధర్మాసనం మాట్లాడుతూ, "ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఆదాయ లోటుతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు కూడా ఉచితాలను కొనసాగించడం సరికాదు. ఈ పథకాల ఖర్చు చివరకు ఎవరి మీద పడుతోంది? పన్ను చెల్లింపుదారులపైనే కదా?" అని ప్రశ్నించింది. రాష్ట్రాలు ఉచితాల కంటే ఉపాధి అవకాశాల సృష్టి,మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి స్థిరమైన చర్యలపై దృష్టి పెట్టాలని సూచించింది. అవసరమైన వారికి తాత్కాలిక సహాయం చేయడం కన్నా, స్వయం సంపత్తిని పెంచే మార్గాలను అందించడమే సముచితమని అభిప్రాయపడింది.

వివరాలు 

ఉచితాలు,సామాజిక సంక్షేమ కార్యక్రమాల మధ్య స్పష్టమైన తేడాఉండాలన్న సుప్రీం 

ప్రత్యేకంగా తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల సమయానికి తక్షణం ఉచిత విద్యుత్ పథకం ప్రకటించడం పై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి హఠాత్ నిర్ణయాలు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు) ఎదుర్కొనే ఆర్థిక లెక్కలను కుదేలుచేస్తాయని పేర్కొంది. టారిఫ్‌లు, బడ్జెట్ అంచనాలు ముందుగా సిద్ధం చేయకపోతే వ్యవస్థలో అవ్యవస్థత ఏర్పడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తరహా ఉచితాల ప్రభావం దేశ ఆర్థిక పురోగతిని కూడా మందగింపజేస్తుందని హెచ్చరించింది. న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం, ఈ వ్యాఖ్యలు ఎన్నికల ముందు ఇచ్చే ఉచిత హామీలు, నగదు బదిలీ పథకాలపైనా వర్తిస్తాయి. గతంలో కూడా ఇదే ధర్మాసనం ఉచితాలు,సామాజిక సంక్షేమ కార్యక్రమాల మధ్య స్పష్టమైన తేడా ఉండాలని సూచించింది.

Advertisement

వివరాలు 

ఆ అప్పులను చివరకు తీర్చాల్సింది ప్రజలే..

ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలు మరిన్ని ఉచిత పథకాలు ప్రకటించడం సాధారణమైపోయింది. గతం కంటే ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు అందిస్తామని హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఆదాయ వనరులను పెంచడంలో విఫలమైతే అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ అప్పులను చివరకు తీర్చాల్సింది ప్రజలే. వడ్డీ భారమూ ప్రజలపైనే పడుతుంది. ఇంకా అనర్హులకు కూడా ప్రయోజనాలు అందడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత బలహీనమవుతోంది.

Advertisement

వివరాలు 

అర్హులైన వారికి మాత్రమే పథకాల ప్రయోజనాలు

ఫలితంగా రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ, గృహనిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదు. కొత్త భారీ ప్రాజెక్టులు ప్రారంభించడం కష్టమవుతోంది. ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా పూర్తిచేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు రాష్ట్రాల పాలనలో అసమతుల్యతకు దారి తీస్తున్నాయని సుప్రీంకోర్టు భావిస్తోంది. అందుకే నిజంగా అర్హులైన వారికి మాత్రమే పథకాల ప్రయోజనాలు అందే విధంగా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని సూచించింది.

Advertisement