Loading...
Bofors Case: నాలుగు దశాబ్దాల బోఫోర్స్ వివాదానికి తెర.. చివరి పిటిషన్‌ కొట్టివేత
నాలుగు దశాబ్దాల బోఫోర్స్ వివాదానికి తెర.. చివరి పిటిషన్‌ కొట్టివేత

Bofors Case: నాలుగు దశాబ్దాల బోఫోర్స్ వివాదానికి తెర.. చివరి పిటిషన్‌ కొట్టివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి న్యాయపరమైన ప్రక్రియకూ సుప్రీంకోర్టు ముగింపు పలికింది. 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ కే. అగ్రవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అదనపు సమయం కోరగా, ఇప్పటికే హిందూజా సోదరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో ఇచ్చిన తీర్పు అమల్లో ఉందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా గతంలోనే తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించింది.

వివరాలు 

సీబీఐ వ్యవహరించిన తీరుతో ప్రభుత్వ ఖజానాపై రూ.250 కోట్ల భారం

ఈ పరిస్థితుల్లో కేసును మరింత కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేస్తూ తాజా పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.

హిందూజా సోదరులపై నమోదైన అన్ని ఆరోపణలకు సంబంధించిన కేసులను ఢిల్లీ హైకోర్టు 2005లోనే కొట్టివేసింది.

ఆ సందర్భంగా దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై తీవ్ర విమర్శలు చేసింది.

సీబీఐ వ్యవహరించిన తీరుతో ప్రభుత్వ ఖజానాపై రూ.250 కోట్ల భారం పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

అనంతరం ఆ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2018లో ఆ అప్పీల్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

అప్పీల్ దాఖలు చేయడంలో సీబీఐ 4,522 రోజులపాటు అకారణంగా ఆలస్యం చేసిందని పేర్కొంటూ దాన్ని కొట్టివేసింది.

వివరాలు 

కేసు నేపథ్యం

భారత సైన్యానికి 400 హోవిట్జర్ గన్‌లను సరఫరా చేసేందుకు స్వీడన్‌కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం 1986 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ కాంట్రాక్టును పొందేందుకు భారతీయులకు బోఫోర్స్ సంస్థ ముడుపులు చెల్లించిందంటూ స్వీడన్ రేడియో ప్రసారం చేసిన కథనం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, న్యాయపరమైన దుమారానికి కారణమైంది.

ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించిన చివరి పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో, బోఫోర్స్ కేసుకు పూర్తిస్థాయిలో తెరపడినట్లైంది.

ADVERTISEMENT