తీస్తా సెతల్వాద్‌కు ఊరట; మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్ల కల్పిత సాక్ష్యాల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె మద్యంతర బెయిల్ సర్వోన్నత న్యాయస్థానం జులై 19 వరకు పొడిగించింది. తీస్తా సెతల్వాద్‌ను తక్షణమే లొంగిపోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు జూలై 19వరకు స్టే విధించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
కేసు నేపథ్యం ఇదీ
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఇరికించేలా కల్పిత పత్రాలను రూపొందించారనే అభియోగాలతో గుజరాత్ పోలీసులు తీస్తా సెతల్వాద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కల్పిత సాక్ష్యాలు, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై తీస్తా సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి ఆర్‌బి శ్రీకుమార్‌లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత తీస్తా సెప్టెంబర్ 2022లో గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను తీస్తా సెతల్వాద్ రూపొందించారని, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్ ముందు ఆ తప్పు సాక్షాలను దాఖలు చేశారని గుజరాత్ ఏటీఎస్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.