Supreme Court : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆయా కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని కేంద్ర దర్యాప్తు బృందం నిలదీసింది. ఈ క్రమంలోనే రఘురామ కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాల్సిందిగా ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. గత పదేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
కోరుకున్న స్వేచ్ఛనిచ్చిన సీబీఐ : ఎంపీ రఘురామ
మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్ధ (సీబీఐ) నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని ఎంపీ రాఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిపై త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐ ఏజెన్సీలో కనిపించట్లేదన్నారు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నా, ఇష్టానుసారంగా వాయిదాలు కోరుకునే స్వేచ్ఛ ఇచ్చారని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఈ కేసులకు సంబంధించిన విచారణ చాలా ఆలస్యమైపోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే, కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించట్లేదన్నారు. ఈ కారణంగానే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని, వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.