Siddaramaiah: సీఎం మార్పు చర్చల మధ్య సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపును సవాల్ చేస్తూ కె. శంకర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ధర్మాసనం సూచించింది. పిటిషన్‌లో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందువల్ల ఆయన వరుణ ఎన్నిక రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో, పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు ఇచ్చింది. ఇక మరోవైపు కర్ణాటకలో సీఎం మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Details
ఈనెల 19లోగా వివరాలు సమర్పించాలి
సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఆగడం లేదు. ఈ రాజకీయ ఊహాగానాల నడుమ సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడం మరింత ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో డీకే శివకుమార్‌కు కూడా ఈవోడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలు, సంబంధిత విషయాలపై వివరణ ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఆదేశించారు. ఈ నెల 19లోపు వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఈ కేసులో ఇటీవలే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.