Telangana GOVT: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు.. జీవో 46పై కేసు
తెలంగాణ రాష్ట్రంలో 5,010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46పై దాఖలైన పిటిషన్లతో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఈ జీవోకు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో, దాన్ని సవాల్ చేస్తూ మాటూరి శ్రీకాంత్ సహా 74 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓక, అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించి, తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేసింది. బాధితుల తరఫు న్యాయవాది ఆదిత్య సోండీ, కేసు పరిష్కారమయ్యే వరకు 900 ఖాళీ పోస్టుల భర్తీని నిలిపివేయాలని వాదించారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు వేచిచూడాలని స్పష్టం చేసింది.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన వ్యక్తం
ఇక రాష్ట్రంలో జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. జీవో వల్ల సమానత్వం ఉందని, ఇది ఎవరికీ నష్టం కలిగించదని కొందరు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. కొందరు అభ్యర్థులు ఈ జీవో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం చేస్తుందని, 2018 నోటిఫికేషన్ ప్రకారం నిబంధనలు అమలు చేస్తే జిల్లాల వారీగా అసమానత్వం ఏర్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2022 నోటిఫికేషన్‌లో అన్ని జిల్లాల అభ్యర్థులకు సమానత్వం కల్పించేందుకు జీవో నంబర్ 46ను ప్రవేశపెట్టినట్లు వివరించింది.