Supreme Court: పాక్ కళాకారులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
భారత్‌లో పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంకుచిత మనస్తత్వం ఉండకూదని పిటిషనర్ ఫిలిం మేకర్, ఆర్టిస్ట్ ఫైజ్ అన్వర్ ఖురేషీని మందలించింది. గతంలో ఖురేషీ దాఖలు చేసిన ఇదే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ అప్పీల్‌ను మరోసారి కొనసాగించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. పాకిస్థాన్ కళాకారులు భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్‌లో ఖురేషీ కోరారు. నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.