Loading...
Supreme Court: 135 ఏళ్ల గ్రంథాలయం తరలింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశం
135 ఏళ్ల గ్రంథాలయం తరలింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశం

Supreme Court: 135 ఏళ్ల గ్రంథాలయం తరలింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలోని 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు ప్రతిపాదనపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్షలాది పుస్తకాలు ఉన్న ఈ చారిత్రక గ్రంథాలయాన్ని తరలించే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పుస్తకాలకు గౌరవం ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేసింది. అవసరం లేదనుకుంటే.. వాటిని జాగ్రత్తగా చూసుకునే మరో దేశానికి అప్పగించాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో కొనసాగుతున్న సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీలో సుమారు 8.5 లక్షల పుస్తకాలు ఉన్నాయి. సెంట్రల్ విస్టా ప్రణాళికలో భాగంగా శాస్త్రి భవన్‌ను పునరాభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రంథాలయాన్ని మరో ప్రాంతానికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది.

వివరాలు 

వాటిని నిర్వహించడం ఇష్టం లేకపోతే.. మరో దేశానికి అప్పగించండి 

ఈ అంశంపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పుస్తకాల పట్ల గౌరవం చూపాలని హితవు పలికింది.

వాటిని నిర్వహించడం ఇష్టం లేకపోతే.. వాటిని భద్రంగా చూసుకునే మరో దేశానికి అప్పగించాలని వ్యాఖ్యానించింది.

తదుపరి విచారణ జరిగే వరకు పుస్తకాలను ఎక్కడికీ తరలించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వివరాలు 

కోర్టు కీలక ప్రశ్నలు

దేశ రాజధానిలోని పురాతన గ్రంథాలయాల్లో ఒకటైన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు అంశంపై గతంలోనూ సుప్రీంకోర్టు స్పందించింది.

అక్టోబర్ 5న జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది.

కొత్త సెంట్రల్ విస్టా ప్రణాళికలో ఈ గ్రంథాలయం కోసం ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదన్న వార్తల నేపథ్యంలో కోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.

గ్రంథాలయం కోసం కేటాయించనున్న స్థలం ఎంత? అక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించనున్నారు? అనే వివరాలతో పాటు పూర్తి లేఅవుట్ ప్రణాళికను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

గత విచారణలోనూ ఈ వివరాలను కోరిన ధర్మాసనం.. తాజాగా పుస్తకాలను తరలించవద్దని స్పష్టం చేసింది.

ADVERTISEMENT