Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. రాజ్యసభ నామినేషన్ పిటిషన్ కొట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మీనాక్షి నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆమెపై రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడేలా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని, కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆ నిర్ణయంలో నేరుగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రిటర్నింగ్ అధికారి ఒకసారి అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆ నిర్ణయంలో నేరుగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో ఎన్నికల చట్టాల ప్రకారం తగిన మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొంది. గతంలో ఇలాంటి కేసుల్లో ఏవైనా భిన్నమైన తీర్పులు ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని కూడా సూచించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడమే సరైన విధానమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని తేల్చి కొట్టివేసింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను ప్రకటించింది.
వివరాలు
ఆర్వో నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది
అయితే ఆమె దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తెలంగాణలో తనపై నమోదైన ఒక కేసుకు సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని ఆరోపిస్తూ, రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం ఆర్వో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని,కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని పార్టీ వాదించింది. నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అక్కడ కూడా ఆమెకు అనుకూల తీర్పు రాలేదు.