
Supreme Court: శిశువుల అక్రమ రవాణా.. యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణకు గడువు
ఈ వార్తాకథనం ఏంటి
నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే,వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ తరహా నేరాలను అడ్డుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో ఒక నవజాత శిశువు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని గుర్తించిన శిశువు తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటికే ఆ చిన్నారిని ఓవ్యక్తి అక్రమంగా విక్రయించినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వివరాలు
యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
తర్వాత ఈ కేసులో న్యాయసహాయం కోసం తల్లిదండ్రులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, వారు నిరాశ చెందారు.
హైకోర్టు విచారణ అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామంతో న్యాయం జరుగలేదన్న భావనతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు,అలహాబాద్ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
చిన్నారుల అక్రమ రవాణా కేసులపై యూపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న చిన్నారుల అక్రమ రవాణా కేసులపై హైకోర్టులు ఎలా విచారణ జరుపుతున్నాయో తెలియజేయాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
ఆసుపత్రికి ఇచ్చిన లైసెన్స్‌ను రద్దు
అంతేకాక, ఈ కేసులో నిందితుడికి మంజూరైన బెయిల్‌ను కూడా రద్దు చేసింది.
''ఈ తరహా కేసుల విచారణను గరిష్టంగా ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి. అవసరమైతే రోజూ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలి'' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అదే సమయంలో, ఏ ఆసుపత్రిలోనైనా నవజాత శిశువుల అక్రమ రవాణా జరిగినట్టు తేలితే ఆ ఆసుపత్రికి ఇచ్చిన లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందేనని సంబంధిత అధికారులకు స్పష్టంగా తెలియజేసింది.
వివరాలు
పోలీసులు నిందితులను పట్టుకునే విషయంలో పూర్తిగా విఫలం
''తనకు కుమారుడు కావాలని ఆశపడ్డ నిందితుడు, రూ.4 లక్షలిచ్చి ఓ చిన్నారిని కొనుగోలు చేశాడు. బిడ్డ కావాలనుకుంటే, చట్టబద్ధ మార్గంలో దత్తత తీసుకోవాలి కానీ అక్రమ రవాణాదారులను సంప్రదించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ చిన్నారి దొంగతనమై తనకు ఇచ్చారని నిందితుడికి స్పష్టంగా తెలిసే పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. వీరు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిందే. అయితే ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకునే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు'' అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.