Supreme Court: రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక సూచనలు.. రూల్స్ మార్పులపై ముందే చెప్పాలని ఉద్ఘాటన
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నిబంధనలను మధ్యలో మార్చడం అనేది సాధ్యపడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ మొదలయ్యే ముందు నిబంధనలు ఖరారు చేసి, ఆ తర్వాత అవి మార్చడం కుదరదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదు మంది సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది. ముందుగా నియమ నిబంధనలను నిర్ణయించి, ఆ తర్వాత వాటిని మార్పు చేయడానికి అవకాశం లేదని సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ఈ ప్రక్రియలో, ఎవరికి నచ్చినట్లు వారు అనుకూలంగా నిబంధనలు మార్చే హక్కు కలిగి ఉండరని, న్యాయస్థానం ఉద్ఘాటించింది నిర్దిష్టంగా, ఆ నియమాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి అనుగుణంగా ఉండాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పటికే నిర్ణయించిన నిబంధనలను మళ్లీ మార్చడం ద్వారా అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం తప్పు అని తెలిపింది.
మంజుశ్రీ Vs ఏపీ స్టేట్ కేసులో తీర్పు సమర్ధన
2008లో వచ్చిన "కె. మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్" కేసు తీర్పును ధర్మాసనం సమర్థించింది. ఇది సరిగ్గా ఉందని, దానిని తిరస్కరించడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే 2014 నాటి "స్టేట్ ఆఫ్ రాజస్థాన్ Vs తేజ్ ప్రకాశ్ పాఠక్" కేసును కూడా ప్రస్తావించింది. జస్టిస్ పంకజ్ మిశ్రా "మంజుశ్రీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సరైంది" అని వ్యాఖ్యానించారు. "హర్యానా Vs సుభాష్ చందర్ మార్వాహా (1974) కేసు దీనికి విభిన్నంగా ఉంది" అని తెలిపింది. ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు ముందుగా సిద్ధం చేసి, ఆ తర్వాతే అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించాలనీ ధర్మాసనం పేర్కొంది. నియామక ప్రక్రియ చివరికి ఖాళీలను పూరించిన తరువాత ముగుస్తుందని తెలిపింది.
ఖాళీ ఉన్న చోటే అభ్యర్థులకు నియామకం
ఎంపిక జాబితాలో అభ్యర్థి పేరు ఉన్నా, ఉద్యోగానికి సంపూర్ణ హక్కు ఉండదు. ఖాళీ ఉన్న చోట, ఎంపిక చేసిన జోన్‌లోని అభ్యర్థులకు మాత్రమే నియామకం జరగాలి. ప్రతి రిక్రూట్‌మెంట్ విధానంలో, ఉత్తమ ప్రమాణాలను రూపొందించడం మేనేజింగ్ విభాగానికి అవకాశమని ధర్మాసనం వివరించింది.