EVM-VVPAT-Supreme Court: 'మేము ఎన్నికలను నియంత్రించలేము': సుప్రీం కోర్టు
ఈవీఎం(EVM)లలో పోలైన ఓట్లను వీవీపాట్(VVPAT)తో సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పునిచ్చింది. ఈ అంశంపై లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేసిందని వెల్లడించింది. తాము ఎన్నికలను నియంత్రించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణతో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాహద్ ల తో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. ఎన్నికలను సుప్రీంకోర్టు నియంత్రించలేదని, రాజ్యంగబద్ధ సంస్థల నిర్వహణను కూడా సుప్రీం కోర్టు నియంత్రించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం వీవీపాట్ లు, ఈవీఎం ల పై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేసిందని ఈ కారణంగా వారి ఆలోచనా విధానాన్ని తాము మార్చలేమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈవీఎంల సోర్స్ కోడ్ వెల్లడించకూడదు: సుప్రీం కోర్టు
ఈ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాది కల్పించుకుంటూ...పారదర్శకత కోసమే ఈవీఎం ల సోర్స్ కోడ్ ను బయటకు వెల్లడించాలని కోరారు. దీనికి స్పందించిన జస్టిస్ ఖన్నా ...ఈవీఎం ల సోర్స్ కోడ్ వెల్లడించకూడదని, అలా చేస్తే అది దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని తెలిపారు.