Supreme Court: పన్నూన్ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు.. ఆ దేశానికే వెళ్లండని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచన
ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా కోసం బాధిత కుటుంబం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, ఇది తమ పరిధిలోకి రాదని, చెక్ రిపబ్లిక్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర కేసులో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాపై అభియోగాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్‌లో జైలులో ఉన్నాడు.ఈ క్రమంలోనే నిఖిల్ కోసం అతడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అతడి అప్పగింత కోసం అగ్రరాజ్యం అమెరికా ప్రారంభించిన చర్యలపై భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
విదేశీ కోర్టుకు వెళ్లాలని సూచన చేసిన సుప్రీం
ఇదే సమయంలో ఈఏడాది జూన్ నుంచి నిఖిల్ గుప్తాను విదేశీ జైలులో అక్రమంగా నిర్బంధించారని, రాజకీయ కుట్రలకు నిఖిల్ బాధితుడయ్యాడని పిటిషన్'లో పేర్కొన్నారు. అక్కడ అతడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, నిఖిల్ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో తమకు సాయం చేసేలా హోంశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖలను ఆదేశించాలని నిఖిల్ కుటుంబం సుప్రీంను కోరింది. ఇది అత్యంత సున్నితమైన అంశమని, మరో దేశంలో జరిగిన అరెస్ట్ తమ న్యాయ పరిధిలోకి రావని పేర్కొంది. ఫలితంగా మీరు ఆ దేశ (చెక్ రిపబ్లిక్) కోర్టుకు వెళ్లండని సూచిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.