Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. గురువారం జరిగిన విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాచారం అనంతరం బాధితురాలు ఎదుర్కొన్న వేదనను ఏదీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. ముందుగా పౌరుల గౌరవాన్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
వివరాలు
పౌరుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచన
ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలు లేదా ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే సవాలు చేయగలరని, ప్రభుత్వానికి అలాంటి హక్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదని, శిశువుకు జన్మనిచ్చి దత్తతకు ఇవ్వడమే మార్గమని ప్రభుత్వ న్యాయవాది వాదించినా, కోర్టు ఆ వాదనను తిరస్కరించింది. ఇదే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి జోక్యం చేసుకుని, వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని, అదే విధంగా ప్రభుత్వం కూడా వ్యవహరించాలని సూచించారు. చివరకు కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, బాధితురాలి హక్కులకు ప్రాధాన్యం ఇచ్చింది.