Supreme Court: ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఓ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ డీజీపీతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ ఏర్పాటు, దాని విధివిధానాలకు సంబంధించిన అధికారిక ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది.
వివరాలు
వీడియోలు, సీసీటీవీ రికార్డులు పరిశీలన
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసకు సంబంధించిన వీడియో ఫుటేజీ, సీసీటీవీ రికార్డింగ్స్‌ను కమిటీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కూడా కమిటీ దృష్టి సారించనుంది.
మార్చ్ సందర్భంగా మహిళా నిరసనకారులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయన్న ఆరోపణలతో పాటు నమోదైన ఫిర్యాదులను కూడా కమిటీ పరిశీలిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఘటనల్లో బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరి వాదనను కమిటీ నమోదు చేసుకుని పరిశీలించనుందని తెలిపింది.
కమిటీ సమర్పించే నివేదిక, సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.
వివరాలు
విద్యార్థుల ఎఫ్ఐఆర్‌లపై కీలక వ్యాఖ్యలు
విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తాను ధర్మాసనం ఆదేశించింది.
ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆర్టికల్ 19 కింద విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని ధర్మాసనం గుర్తుచేసింది.
విద్యార్థుల భవిష్యత్‌పై ఎఫ్ఐఆర్‌ల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.