Yoga guru Ramdev: రామ్ దేవ్ బాబా.. చర్యలకు సిద్ధంగా ఉండండి: సుప్రీం కోర్టు
పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు మండిపడింది. తప్పుడు వ్యాపార ప్రకటనలపై గతంలో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ అషనుద్దీన్ అమనుల్లాలతో కూడిన ధర్మాసనం రామ్ దేవ్ బాబాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రకటనలపై గతనెలలో విచారణ సందర్భంగా రామ్ దేవ్ బాబా చెప్పిన క్షమాపణలతో తాము అంగీకరించలేమని జస్టిస్ హిమా కోహ్లి వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజలను మోసగించడం సరికాదని, బాధ్యతతో కూడిన వ్యాపార దృక్పథాన్నిపతంజలి సంస్థ తప్పనిసరిగా కలిగి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
విచారణను ఈనెల 10కి వాయిదా
గతంలో కోర్టుకు చెప్పిన క్షమాపణలను అంగీకరించడం లేదని,మరింత నిజాయితీతో కూడిన వ్యాపార దృక్పథాన్ని కలిగి ఉండాలని తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా రామ్ దేవ్ బాబా తరఫు న్యాయవాది ధర్మసనానికి వాదనలు విన్పిస్తూ.. అవసరమైతే రామ్ దేవ్ బాబా,బాలక్రిష్ణ ఇద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతారని కోర్టు చెప్పారు. ఈదశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ..ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుని వ్యవహరిస్తోందో ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. తదుపరి విచారణకు రాందేవ్ బాబా,బాలక్రిష్ణ ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాల్లో తప్పుడు వ్యాపార ప్రకటనలను వేయవద్దని పేర్కొంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.