
Sardar jokes: సిక్కు సమాజంపై జోకులను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో విచారణకు రాబోతున్న అంశం..
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు గురువారం సిక్కు కమ్యూనిటీపై జోకులను ప్రదర్శించే వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం,"ఇది చాలా సున్నితమైన, కీలకమైన విషయం" అని అభిప్రాయపడింది.
పిటిషనర్ హర్విందర్ చౌదరి తన సూచనలను,ఇతర పార్టీల సూచనలను ఏకీకృతం చేసి సంకలన రూపంలో సమర్పిస్తానని తెలిపారు.
పిటిషనర్ హర్విందర్ చౌదరి, సిక్కు మహిళలు ఎదుర్కొంటున్న మానసిక బాధల గురించి ప్రస్తావించారు.
వారి వస్త్రధారణపై అపహాస్యంగా జోకులు చేయడం వల్ల,సిక్కు పిల్లలు కూడా పాఠశాలల్లో వేధింపులకు గురవుతున్నారని,అది తీవ్రమైన మానసిక వేదనకు దారితీస్తుందని తెలిపారు.
అటువంటి వేధింపుల కారణంగా,ఒక సిక్కు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వివరాలు
జోకులు,గౌరవంగా జీవించేందుకు ప్రతి వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నాయి
అక్టోబర్ 2015లో సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
సుమారు 5,000 వెబ్‌సైట్లు సిక్కులపై జోకులు ప్రచురిస్తున్నాయని ఆరోపిస్తూ, పిటిషనర్ అలాంటి వెబ్‌సైట్లపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
ఈ జోకులు, గౌరవంగా జీవించేందుకు ప్రతి వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు.
తదుపరి, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) కూడా, ర్యాగింగ్ నిర్వచనంలో ''జాతి దూషణలు'' మరియు ''జాతిని లక్ష్యంగా చేసుకోవడం'' వంటి అంశాలను చేర్చాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
ఇది సిక్కు విద్యార్థులు విద్యాసంస్థల్లో ఎదుర్కొంటున్న అవమానాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉంది.