HCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో గుర్తింపు, సంఘంలో నెలకొన్న పలు అంశాలపై హెచ్‌సీఏ, చార్మినార్ క్రికెట్ అసోసియేషన్, అజహరుద్దీన్, జాన్ మనోజ్, బుడ్డింగ్ స్టార్ క్రికెట్ ఆసోసియేషన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియా ధర్మాసనం విచారణ జరిపి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వీలైనంత త్వరగా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Details
కక్రూ నేతృత్వంలోని కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు
హెచ్‌సీఏ వ్యవహారాలపై గతంలో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీనే ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని పేర్కొంది.
కొత్త కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలని న్యాయస్థానం సూచించింది. మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాల కారణంగా హెచ్‌సీఏకు సంబంధించి కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి.
గతేడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు జస్టిస్ కక్రూ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ కమిటీ సభ్యుల్లోనూ విభేదాలు తలెత్తడంతో ఆ కమిటీని సుప్రీం కోర్టు రద్దు చేసింది.