Andhra Pradesh: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో వర్షాల సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. గురువారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాలను కూడా సంస్థ వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో అత్యధికంగా 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 27.2 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 18.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా గుర్లలో 14.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది.
వివరాలు
ఎండ తీవ్రత
మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతోంది. గురువారం మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 43.8 డిగ్రీలు నమోదవగా, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చెరో 43.7 డిగ్రీలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.6 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.